Online Puja Services

నాయనార్ల గాథలు - శ్రీ తిరు జ్ఞాన సంబందార్

18.116.90.141

నాయనార్ల గాథలు - శ్రీ తిరు జ్ఞాన సంబందార్  | Nayanar Stories - Sri Thiru Jnana Sambandar 
-లక్ష్మీ రమణ 

శివ కుమారుడే స్వయంగా ఈ భువిపైన ఉద్భవించారా అనిపిస్తుంది నాయనారు శ్రీ తిరు ఙ్ఞాన సంబందార్ చరితని చదువుతూ ఉంటే ! ఆనాడు తారకాసుర వధ కోసం ఉద్భవించిన కుమారస్వామి కేవలం 7 రోజులలో యుద్ధానికి సన్నద్ధమైనట్టు,  ఈ బాలయోగి మూడేళ్ల పసిప్రాయంలో ఆదిదంపతుల కృపకి పాత్రుడై, భక్తి ప్రబోధాన్ని చేసి ఎందరో అనునూయులని తయారు చేసుకున్నారు. మరో శంకరాచార్యుని తలపించిన శ్రీ తిరుజ్ఞానసంబందార్ నాయనారు దివ్యోదంతాన్ని సంక్షిప్తంగా చెప్పుకుందాం . 

అది చోళ రాజులు తమిళదేశాన్ని పరిపాలిస్తున్న కాలం. జైనమత ప్రాబల్యం ఎక్కువై సనాతన ధర్మాన్ని అణిచివేసే విధంగా, వారిపై జైనులు దాడులకు సైతం తెగబడుతున్న సమయం.  అటువంటి సమయంలో  సర్కాళి (శియ్యాళి) అనే ఊరిలో శివపాదహృదయుడు , భగవతి అనే శివభక్తులు ఉండేవారు. పేరుకి తగ్గట్టు ఆ దంపతులు ఆదిదంపతులే తమ దైవాలని, శైవ సంప్రదాయాన్ని, సనాతన ధర్మాన్ని వీడేది లేదని శివసేవే పరమావధిగా జీవిస్తూ ఉండేవారు.  తిరిగి ఈశ్వరభక్తి మార్గాన్ని పునరుద్ధరించగలిగిన బాలుణ్ణి తమకి బిడ్డగా అనుగ్రహించమని పరమేశ్వరుణ్ణి నిత్యమూ వేడుకునేవారు. ఆ దివ్యదంపతులకి శివానుగ్రహం చేత ఒక ముద్దులొలికే బాలుడు జన్మించాడు.  అతనికి  అలూదయై పిళ్ళైయారు అని నామకరణం చేసి పెంచుకోసాగారు.  

అలూదయై పిళ్ళైయారుని తీసుకొని ఒక శుభ ముహూర్తాన శివాలయానికి వెళ్లారు శివపాదుడు , భగవతి దంపతులు. అక్కడ పిల్లవాడిని శివ సన్నిధిలో వదిలి, పూజా విధులకి సిద్ధపడుతూ,  తటాకంలో స్నానమాచరించానికి వెళ్లారు.  ఆ సమయంలో  ఆ బాలుడు ఆదిదంపతులని చూసి బిగ్గరగా ఏడవం మొదలు పెట్టాడు.  ఆలయంలో ఉన్న అయ్యవారు , అమ్మవారు ఆ బిడ్డ ఏడుపుకి కరిగిపోయారు.  అయ్యవారి ఆదేశానుసారం, అమ్మ స్వయంగా తన స్తన్యాన్ని ఒక బంగారు కప్పులో నింపి ఆ బిడ్డడికి పట్టింది.  జగన్మాత స్తన్యాన్ని ఎప్పుడైతే ఆబాలుడు స్వీకరించాడో అప్పుడే అతను ఆ జగన్మాత ముద్దు బిడ్డ అయ్యాడు. స్వయంగా ఆ జ్ఞానేశ్వరుని కుమారుడై, జ్ఞానసంబందారు అయ్యాడు. 

ఆశువుగా ఆ మూడేళ్ళ బాలుడు, నటరాజ భంగిమలో ఒక పాదాన్ని పైకి లేపి ఉంచి, అద్భుతమైన పడిగము పాడి ఈశ్వరుణ్ణి, అక్కడున్నవారందరినీ ఆశ్చర్యపరిచాడు.  అప్పుడు ఈశ్వరుడు , పార్వతీ దేవి సమేతంగా వృషభవాహనం పైన ఆశీనుడై దర్శనం ఇచ్చారు.  తల్లిదండ్రులు , భక్తులు అతన్ని ఊరేగిస్తూ , సంతోషంగా , సంబరంగా ఇంటికి తీసుకువెళ్లారు. 

ఆ మరునాడు ఆ తిరుక్కోలకకు చేరుకొని అక్కడ శివుని కీర్తిస్తూ, ఒక చక్కని కీర్తన పాడారు చిన్నారి జ్ఞానసంబందారు. ఆయన పాతపాడుతూ తాళం వేస్తుంటే, ఆ చిన్నారి చేతులు నొప్పి పుడతాయేమో అని ఈశ్వరుడు ఆయన చేతుల్లో ఒక బంగారు తాళము ( భజనలో కొట్టే తాళ వాయిద్యము)ని ఉంచారు. వాటిపైన పంచాక్షరి లిఖించి ఉంది.  అప్పుడు ఆ చిన్నారి శివ యోగి చేసిన గానానికి దేవర్షులు, గంధర్వులు కూడా పరవశించిపోయారు. అది మొదలుగా శివుని మెప్పించిన ఎన్నో కీర్తలు పాడారు జ్ఞానసంబందారు. 

జ్ఞానము పొందినవారికి ఇక ఇహముతో పనేముంది! జ్ఞాన సంబందారు కదా మన చిన్నారి.  అందుకని ఆ చిన్న వయసులోనే తీర్ధయాత్రలకి బయలు దేరారు. మొదట, ఆ ఈశ్వరుడు విశ్వైకనాట్యం చేసిన దివ్య స్థలి చిదంబరానికి వెళ్లారు.  అక్కడి  ఈశ్వరుడు, తన భక్తులతో ఉన్నప్పుడు - శివుడు తన శివగణాలతో కూడి ఉన్నట్టుగా దర్శనమిచ్చాడు. సంబందారు ఆ దర్శనాన్ని వర్ణిస్తూ మరో అద్భుతమైన కీర్తన ఆలపించారు. ఇక్కడే ఆయనకి మరో నాయనారు తిరుయాజ్ పనార్ కలిశారు.  సంబందారు కీర్తనలని యాజ్ పై పలికిస్తూ ఆయనతో కలిసి నడవాలనే  తన  అభిలాషని సంబందారుకి విన్నవించడం, ఆయన అంగీకరించడం జరిగింది.  ఆ విధంగా ఒక దివ్యమైన సంగీత సాహిత్యముల కలియక జరిగి శివ భక్తి ఉద్యమానికి మరింత ఊపు లభించింది. 

ఆ తర్వాత సంబందారు తిరు ఆరుతూరాయి వెళ్ళాలని అనుకున్నారు. ఆ చిన్నారి యాజ్ పనారుతో కలిసి కొంత సేపు నడుస్తూ  ఉంటె, మరికొంత సేపు ఆయన తండ్రి శివ పాదుడు ఎత్తుకొని తీసుకువెళ్ళేవారు.  అలా ఆ చిన్నారినడిచి శ్రమపడడం ఆ విశ్వనాథుడు భరించలేకపోయారు. ఈశ్వరుడు తిరు ఆరుతూరాయి బ్రాహ్మణులకి కలలో కనిపించి సంబందారుకి ముత్యాలపల్లకీ పంపాల్సిందిగా ఆజ్ఞాపించారు.  వారు మేళతాళాలతో ముత్యాల పల్లకీని తీసుకొని వచ్చి , చిన్నారి సంబందారుని తీసుకువెళ్లారు . అలా అక్కడి పరమేశ్వరుడు తండ్రి ప్రేమని చూపి, సంబందారు గొప్పతనాన్ని ప్రపంచానికి చాటారు. ఇటువంటి సందర్భాలు జ్ఞానసంబందారు జీవితంలో ఎన్నో జరిగాయి. 

అటు తర్వాత, ఈశ్వర కృపతో ఆయన చేసిన అద్భుతాలు ఎన్నో ఉన్నాయి. వాటిల్లో మాళవరాజ కుమార్తెకి తరగని జబ్బుని నయం చేయడం ఒక అద్భుతం.  ప్రజలు తీరని జ్వరంతో బాధపడుతుంటే, జ్వరంతకుడైన ఈశ్వరుని కీర్తనతో ఆ ప్రాంత ప్రజలకి స్వాంతన చేకూర్చారు. తన తండ్రి ఒక యజ్ఞాన్ని తలపెడితే , దానికి సరైన ధనసదుపాయం లేక ఇబ్బంది పడుతున్నారని తెలుసుకొని, ఈశ్వర కృపతో ఆ ధనాన్ని సమకూర్చి, యజ్ఞాన్ని జరిపించారు . ఆ తర్వాత సత్తిమంగాయి చేరుకొని అక్కడ మరో నాయనారు తిరు నీలకంఠ నాయనారుని కలుసుకున్నారు.  ఇద్దరూ కలిసి ఈశ్వరరార్చనలు చేశారు. ఆ సమయంలోనే, ఈశ్వర దర్శనానికి వచ్చిన ఒక వైశ్యుడు చనిపోవడం, ఆ వైశ్యుని భార్య బాధని చూడలేక సంబందారు తిరిగి అతన్ని బ్రతికించడడం ఈశ్వర అనుగ్రహ ప్రదాయకమైన మరో అద్భుత సంఘటన. ఆ తర్వాత నాయనార్లయిన అప్పారు , మురగ నాయనారు, గుగ్గులు కలశ నాయనార్లని కూడా కలిసి వారితో కొంతకాలము శివసంకీర్తనలతో గడిపారు. ఈ విధంగా నాయనార్ల గాధలకి సంబందారుకి విడదీయలేని బంధం ఉంది . ఒక రకంగా ఆయన కీర్తనల ద్వారానే తమిళ శివభక్తులైన నాయనార్ల చరితలు పెరియపురాణమై ప్రపంచానికి పరిచయం అయ్యాయేమో !!

ఇదిలా ఉండగా మధురలో జైనుల ప్రాబల్యం అధికమవ్వడమే కాకుండా , అక్కడి  ప్రజలకి  బలవంతంగానైనాసరే , జైనాన్ని అవలంభించాల్సిన పరిస్థితి దాపురించింది.  వారి పాలకుడు పాండ్య భూపతి జైనాన్ని స్వీకరించడం వలన ఈ పరిస్థితి అక్కడి ప్రజలకి దాపురించింది . కానీ రాజుగారి సోదరి, మంత్రులు శివారాధకులు . శివుని పుత్రునిగా, తన కీర్తనలతో అద్భుతాలు చేస్తున్న ఆ చిన్నారి సంబందారు మాత్రమే తమ రాజ్యంలో ఈ విధంగా జరుగుతున్న అరాచకాల నుండీ ప్రజలను కాపాడగలరని వారు నమ్మారు . దాంతో సంబందారుని మధురై కి ఆహ్వానించారు. 

సంబందారు ఆ ఆహ్వానాన్ని మన్నించారు. కానీ ఆయన అనునూయులు , మిత్రులూ మధురలో జరుగుతున్న జైనుల దురాగతాలని విని, ఆయన్ని చోళ రాజ్యం వీడి, పాండ్య రాజ్యానికి వెళ్లవద్దని అభ్యర్ధించారు. శివుడే తోడై ఉండగా, తనకి లోటులేదని, వెనకడుగు వేయాల్సిన అవసరం లేదని సంబందారు మధురై కి ప్రయాణమయ్యారు. 

ఆయన రాగానే, సుదారేశ్వరుడు , మీనాక్షి దేవాలయానికి నూతన కళ వచ్చినట్టు అనిపించింది. ఆ దేశంలో ఉన్న శైవులకి కొత్త ప్రాణం చేకూరినట్టు అనిపించింది. సుందరారుకి వారందరూ ఘానా స్వాగతం చెప్పారు.  ఆయన సుందరేశ్వరుని దర్శించి చక్కని కీర్తనలతో ఆరాధించారు. 

  జైనులు సుందరారు గురించి అప్పటికే విని ఉన్నారు.  ఆయన  రాకతో తమ ప్రాబల్యం తగ్గిపోతుందని కుట్రకి తెగబడ్డారు. శైవ మతాన్ని ప్రభోదించి జైనులని కూలద్రోసేందుకే బాల సన్యాసిగా సుందరారు మధురైకి వచ్చారని, దాన్ని అడ్డుకోవాల్సిన అవసరం ఉందంటూ రాజుకి నూరిపోశారు. రాజు వారి మాటల చాతుర్యానికి లోబడ్డారు.  సుందరారు , ఆయన అనునూయులు ఉన్న గుడారాలని తగలబెట్టమని ఆజ్ఞాపించారు.  శివ మహిమ చేత సుందరారు గుడారాన్ని ముట్టుకోలేకపోయినా, మిగిలిన వారి గుడారాన్ని తగులబెట్టే పనిని విజయవంతంగా చేశారు ఆ ముష్కరులు .  దాంతో, సుందరారు శివయ్యని తన కీర్తనలో, ఎగసి పడుతున్న  ఆ మంటలు రాజుగారి ఆజ్ఞ వల్ల సంభవించాయి, కనుక అవి ఈ ప్రదేశాన్ని వదిలి ఆయన శరీరాన్ని చేరేట్టు అనుగ్రహించమని కోరాడు.  వెంటనే ఆమంటలు ఆ ప్రాంతంలో ఉపశమించాయి. రాజుగారి శరీరమంతా భరించరాని మంటలు ఆరంభమయ్యాయి. 

ఆ మంటల్ని తగ్గించడం రాజ్యంలోని వైద్యులకి చేతకాలేదు. రాజుగారికి చేసిన పొరపాటు అర్థమయ్యింది.  వెంటనే ఆ చిన్నారి శివయోగిని శరణువేడాలని, ఆయన్ని తన మందిరానికి సాదరంగా ఆహ్వానించమని మంత్రిగారిని పంపారు.  ఈ లోగా   జైన మత పెద్దలు తమ మంత్రాలతో రాజుగారికి ఉపశమనాన్ని కలుగజేస్తామని వచ్చారు.  సంబందారుతో రాజుగారికి ఉపశమనాన్ని కలిగించేదే గొప్ప మతం అని వాదించారు. తాము రాజుగారి శరీరంలో ఒక వైపు మంటల్ని తగ్గిస్తామని, రెండవవైపు సంబందారు తగ్గించాలని సవాలు విసిరారు.  సరే నని, ఒక కీర్తన ఆలపించి, రాజుగారి ఒకవైపు శరీర భాగానికి తన చేత్తో విభూతి రాశారు సుందరారు. వెంటనే ఆ వైపు మంటలు ఉపశమించాయి.  జైనులు రెండవవైపు ఎన్ని మంత్రాలు చదివినా, ఆ వైపు మంట పెరిగిందే తప్ప ఉపశమించలేదు. పాండ్యరాజు దీనంగా సంబందారుని వేడుకున్నాడు .  అప్పుడు సంబందారు తిరిగి రెండవవైపున కూడా తన చేతితో విభూతిని రాశారు .  అప్పుడు రాజుగారికి పూర్తిగా స్వస్థత చేకూరింది. 

ఈ అద్భుతాన్ని సంబందారు నిరూపించిన శైవమత సత్యం అని ప్రజలు వేనోళ్ళా కీర్తించసాగారు. ఇది జైన మాట పెద్దలకి కొరుకుడు పడలేదు. చివరిగా తమకొక అవకాశాన్నివాల్సిందని వారు రాజుగారిని అభ్యర్ధించారు.  ప్రత్యక్షప్రమాణంగా అగ్ని పరీక్షకి ఉపక్రమించారు. వారి దైవము గుణగణాలని ఒక పత్రముపైన రాయించారు. సంబందారుని శివుని గురించి ఒక పత్రముపైన రాయమన్నారు.  ఈ రెండింటినీ అగ్నిలో వేస్తే , ఏది కాలకుండా ఉంటుందో అదే గొప్ప మతమని తీర్మానించారు.  ఆ రెండిలో అందరూ చూస్తుండగానే జైన పత్రం కాలిపోయింది.  ఆ విధంగా అగ్నిపరీక్షలో సంబందారు గెలిచారు, కాదు కాదు , శైవ సత్యాన్ని అగ్ని సాక్షిగా చాటి చెప్పారు. అక్కడ ప్రజలలో శైవవిశ్వాసాల్ని తిరిగి ప్రతిష్టించి మరో శంకరాచార్యులై ముందుకు కదిలారు జ్ఞానసంబందారు. 

ఈ సంఘటనతో సంబందారు తల్లిదండ్రులు ఏ లక్ష్యాన్ని సిద్ధంపజేసే పుత్రుడు కావాలని ఆ ఈశ్వరుని అర్థించారో ఆ  ప్రయోజనం సిద్ధించినట్టయ్యింది.  ఇదేకాక, బోధిమంగళ్ చేరి అక్కడ బౌద్ధ గురువైన శారిబుద్ధన్ ను ఓడించారు.  దాంతో శారిబుద్ధన్ తానె స్వయంగా శైవాలంబీకుడయ్యారు. ఆయన అనునూయులు కూడా శివారాధననే స్వీకరించారు.  ఈ విజయ పరంపరలు విని అప్పారు నాయనారు కూడా జ్ఞానసంబందారుని చూడవచ్చారు.  ఆ తర్వాత అప్పారుతో కూడా కలిసి తీర్థయాత్రలు కొనసాగించి, శివ సంకీర్తనలతో శైవ ధర్మాన్ని వ్యాప్తి చేశారు .  తన మజిలీలో ఎన్నో అద్భుతాల్ని ఈశ్వరుని విభూతిగా ప్రదర్శించారు .  చనిపోయిన వారిని బ్రతికించారు.  కరువుని తరిమేసి , తానున్న నేలని భక్తి బీజాలతో సశ్యశ్యామలం చేశారు.  కొంతకాలానికి తిరిగి తన జన్మస్థలి సర్కాలి చేరుకున్నారు. 

 సంబందారు తీర్థయాత్రలు చేస్తూ ఉన్నప్పుడే అతని తల్లిదండ్రులు ఆయనకీ ఉపనయనం చేశారు.  ఈసారి సర్కాలి చేరుకునే నాటికి  సంబందారుకి దాదాపు 16 ఏళ్ళు నిండాయి. సంబందారుకి వివాహం చేయాలని సంకల్పించారు శివపాద దంపతులు.  సంబందారు అడ్డు చెప్పలేదు. సంప్రదాయ కుటుంబంలోని చక్కని చుక్కని వెతికి సంబంధాన్ని ఖాయం చేశారు. వివాహానికి ముందు సంబందార్ శివాలయాన్ని సందర్శించారు.  ముత్యాల పల్లకిలో పెళ్లికొడుకై ఊరేగుతూ వెళ్లారు. వివాహంలో అగ్ని చుట్టూ ప్రదక్షిణలు చేశారు. ఆ వివాహానికి జ్ఞానసంబందార్ సమకాలీనులైన నాయనార్లందరూ దాదాపుగా వచ్చారు.  

నవదంపతులు బంధుమిత్ర పరివారముతో కూడా కలిసి ఈశ్వరదర్శనార్దం ఆలయానికి వెళ్లారు.  అక్కడ జ్ఞానసంబందార్ భవబంధాల నుండీ విముక్తిని , ముక్తిని కోరుతూ ఈశ్వరుణ్ణి కీర్తించారు.  అప్పటివరకూ సంబందార్ ఏది అడిగినా ఇచ్చిన ఈశ్వరుడు ఈ కోరికను కూడా మన్నించారు. ఒక దివ్యమైన అఖండ జ్యోతిగా, భువిని , దివినీ ఏకం చేస్తూ సంబందార్ ముందర ప్రత్యక్షమయ్యారు.  సంబందార్ దంపతులతోపాటు ఆ వివాహానికి వచ్చిన వారందరూ కూడా సపరివారంగా ఆజ్యోతిలో ప్రవేశించి అనితర సాధ్యమైన కైవల్యాన్ని పొంది కైలాసాన్ని చేరుకున్నారు. 

ఈ విధంగా దాదాపు 16వేల కీర్తనలతో(తేవారాలు) జ్ఞాన సంబందారు  శివుని ఆరాధించినట్టు తెలియవస్తోంది. వాటిల్లో కేవలం 4181 మాత్రమే లభిస్తూ ఉన్నాయి. తన గీతాలతో, ఆధ్యాత్మిక బోధలతో, తీర్థయాత్రలతో  శైవసంప్రదాయాన్ని పునః ప్రతిష్టించి, అతిపిన్న వయసులో అనంత సాహితీ సంపదను ప్రసాదించిన తిరు జ్ఞాన సంబందారు నాయనారు తన భక్తితో ఒక సమూహానికి ముక్తిని ప్రసాదించారు. శివకుమారుడై ఆయన చేసిన లీలలు ఇప్పటికీ తమిళనాడులోని అనేక ఆలయాలలో కనిపిస్తాయి.  ఆ మహనీయుని చరిత సృజియించిన భక్తి సంద్రంలో మనమూ ఒక మునక వేసి ఈశ్వరానుగ్రహానికి పాత్రమవుదాం .  శుభం . 

సర్వం శ్రీ గురు దక్షిణామూర్తి దివ్య చరణారవిందార్పణమస్తు.    

 

 

Nayanar, Stories, Thiru, Jnana, Sambandar, Sambandhar, tiru,

Quote of the day

A coward is incapable of exhibiting love; it is the prerogative of the brave.…

__________Mahatma Gandhi